Vijay Sai Reddy

ముఖ్యమంత్రికి ఎక్కడినుంచైనా పరిపాలించే హక్కు ఉంది
సీఆర్డీఏ కేసులకు తరలింపుకు సంబంధం లేదు

కార్యనిర్వాహక రాజధాని (Executive Capital) అమరావతి (Amaravathi) నుంచి, విశాఖకు (Visakha) తరలింపు జరిగి తీరుతుంది. ఈ ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని వైకాపా (YCP) ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy) నేడు స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పలేము అని అన్నారు. కొవిడ్‌ నియంత్రణ, విశాఖ నగర పరిధిలోని అభివృద్ధి పనులపై బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో విజయసాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. ‘‘మూడు రాజధానుల (Three Capitals) విషయంలో ప్రభుత్వం ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ కేసులకు, రాజధాని తరలింపునకు ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉంది. కొన్నినెలలు హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు కూడా పరిపాలించారు’’ అని విజయసాయి రెడ్డి చెప్పారు.

విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా మారుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అయన అధికారులను ఆదేశించినట్లు తెలియ జేశారు. ముడసర లోవ పార్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం విశాఖ నగరంలో తొమ్మిది ఆసుపత్రులను సిద్ధం చేశామని కూడా చెప్పారు. కొవిడ్‌ నియంత్రణలో విశాఖ జిల్లా ముందువరసలో ఉందని జిల్లా యంత్రాంగాన్ని ఎంపీ కొనియాడారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జీవీఎంసీ మేయర్‌ హరి వెంకటకుమారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Ex Chief Secretary S V Prasad