ఆంధ్ర బాగుపడాలంటే జగన్ పాలన పోవాలి
హలో ఏపీ.. బైబై వైసీపీ అన్నదే మన ఎన్నికల నినాదం
అభివృద్ధి జరగాలంటే జగన్ ప్రభుత్వం మారాలి
అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి…
అంబేద్కర్ కంటే జగన్ రెడ్డి గొప్పవాడా..?
మద్యం పేరుతో విషం అమ్ముతున్న వైసీపీ ప్రభుత్వం
గంజాయిని తగలబెట్టించారనే గౌతమ్ సవాంగ్ ని తప్పించారు.
జనసేన ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్సు
రైతాంగానికి సంపూర్ణ మద్దతు ధర దక్కేలా చర్యలు
కోనసీమ ప్రజల కల నెరవేర్చేలా కోస్తా రైలు మార్గం సాధించేలా కృషి చేస్తాం
వారాహి అమలాపురం బహిరంగసభలో పవన్ కళ్యాణ్
‘అభివృద్ధి జరగాలంటే వైసీపీ ప్రభుత్వం (YCP Government)మారాలి .. అరాచకం ఆగాలంటే జగన్ ప్రభుత్వం (Jagan Government) మారాలి… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి… “హాలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే జనసేన పార్టీ (Janasena Party)ఎన్నికల నినాదం కావాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan పిలుపు నచ్చారు. బహిరంగ సభ వేదిక నుంచి అందరితో నినాదాన్ని చేయించారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన అశేష జనవాహిని ‘హల్లో ఏపీ… బైబై వైసీపీ’ అని నినదిస్తుంటే అమలాపురం దద్దరిల్లింది.
అమలాపురం కూడలి నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత క్రైమ్ రేటు పెరిగిపోయింది. అక్కను వేధించొద్దు అన్న పాపానికి బాపట్లలో 14 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుంది. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. మనల్ని పాలించే నాయకులు బాధ్యతగా లేకపోవడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొంది. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్యను కవర్ చేయడానికి ముందు గుండెపోటు నాటకం ఆడారు.
తరువాత విషయం బయటకు పొక్కడంతో ఎవరో చంపారని చెప్పారు. నిజం బయటకొస్తుందనే భయంతో ఒక వ్యక్తిని చంపేశారు. విచారణ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులను బెదిరించారు. హత్యకు సంబంధించిన కీలక వ్యక్తిని అరెస్టు చేద్దాం అంటే అడ్డుకున్నారు. కోనసీమ కేసులో అభంశుభం తెలియని 250 మంది యువకులపై కేసులు పెట్టడానికి బలంగా పనిచేసిన చట్టాలు… చిన్నాన్నను చంపిన వాళ్లను పట్టుకోవడంలో మాత్రం పనిచేయలేదు. ఇలాంటి ప్రభుత్వాలా మనకు కావాల్సింది?
కోనసీమ జిల్లాకు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు కావాలని పోరాడిన దళిత నాయకులు… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరును జగనన్న విదేశీ విద్యాపథకంగా మారిస్తే ఎందుకు మాట్లాడలేదు..? అప్పుడు జిల్లాకు అంబేద్కర్ పేరు కోసం గట్టిగా పోరాడిన నాయకులు, ప్రభుత్వం చేసిన పథకం పనిని ఎందుకు వ్యతిరేకించలేదు..? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ సభలో మాట్లాడినా నా ఎస్సీ… నా ఎస్టీ అని మాట్లాడతాడు. దళితులకు మేనమామ అంటాడు. నిజంగా ఆయన మేనమామ అయితే దళితులకు సంబంధించిన 23 పథకాలను ఎందుకు తొలగించారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యా పథకంగా ఎందుకు మార్చారు? ఈ రోజు కోనసీమ నడిబొడ్డు నుంచి ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా … అంబేద్కర్ గారి కంటే నువ్వు గొప్పవాడివా జగన్ మోహన్ రెడ్డి. మీరు తీరు మార్చుకోవాలి. కాలం మారుతోంది. ప్రజలు మారుతున్నారు. యువత మారుతోంది. కొత్తతరం వస్తోంది. సమాజంలో మార్పు వచ్చి తీరుతుంది.
విషాన్ని తాగిస్తున్న వైసీపీ సర్కారు
నోట్లో వేలు పెడితే కొరకని పసిబాలుడు అయిన జగన్ బాబు కల్తీ మద్యం అమ్ముతూ ఆడబిడ్డల పసుపుకుంకుమలు తీసేస్తున్నాడు. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాడు. వైద్యులు నన్ను జనవాణిలో కలుస్తున్నపుడు వారు క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను చెబుతుంటే గుండె తరుక్కుపోతోంది. ముఖ్యంగా చిన్న వయసున్న యువత వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ మద్యం తాగి లివర్, కిడ్నీ, పాంక్రియాస్ వ్యాధుల బారిన పడుతున్నారని చెబుతున్నారు. అత్యంత విషపూరితమైన రసాయనాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం తాగి ప్రజలు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలను అనాధలను చేస్తున్నారు. ఆడపడుచుల కళ్ళలో నీళ్ళు నింపిన పాపం ఊరికేపోదు. వైసీపీకి కచ్చితంగా ఇది తగులుతుంది. సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి విషపూరిత మద్యాన్ని ప్రజలతో తాగిస్తున్నాడు.
ధరలను ఇష్టానుసారం పెంచిన వ్యక్తి ప్రజల డబ్బులను దోచుకుంటూ వారి ఆరోగ్యాలు నాశనం చేస్తున్నాడు. దేశంలో ప్రతి ఉత్పత్తికి జీఎస్టీ ఉంటుంది. పన్ను కట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యానికి మాత్రం అన్నీ ఎగ్గొట్టి, కేవలం డబ్బు ద్వారానే లావాదేవీలు చేస్తూ అక్రమమార్గంలో వేలాది కోట్లు మళ్లిస్తోంది. కేవలం 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం రూ.23 వేల కోట్లను మద్యం అమ్మకాలు సాగించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ! చేసుకోవచ్చు. అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధం చెప్పిన జగన్ రెడ్డి మద్యం మీద విపరీతంగా సంపాదించడం మొదలుపెట్టాడు. జనసేన ప్రభుత్వంలో మద్య నిషేధం అని నోటికొచ్చినట్లు హామీ ఇవ్వలేం కానీ… కచ్చితంగా ఆయా ప్రాంతాల్లోని మహిళలు వద్దు అనుకుంటే మద్యం దుకాణాలు లేకుండా చేసే బాధ్యతను తీసుకుంటాం. శ్రీ అన్నా హజారే ఉద్యమం మాదిరిగా రాలేగావ్ సిద్ధి మోడల్ ను తీసుకొస్తాం.
గంజాయిని ఇళ్లలోకి తీసుకొచ్చారు… కాకినాడ గంజాయికి గేట్ వే
వైసీపీ ప్రభుత్వంలో గంజాయిని దేశంలోనే ప్రత్యేక హబ్ గా తయారు చేశారు. కాకినాడను గంజాయికి గేట్ వే చేశారు. వీధుల్లోకి, గ్రామాల్లోకి గంజాయి వచ్చేసింది. యువతను గంజాయి మత్తులో ఉంచి, వారిలో పోరాట పటిమ లేకుండా చేయాలని ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. వారి ఆవయవాలు గంజాయి దెబ్బకు నాశనం అవుతున్నాయి. వైసీపీ గంజాయిని ప్రోత్సహిస్తోంది. జనవాణిలో ఓ తల్లి నా కాళ్ల మీద పడి గంజాయి మత్తులో తన కొడుకు నాశనం అయ్యాడని, ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని
నన్ను మాట్లాడాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ యువతను నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.. గంజాయిని పూర్తిగా వదిలేయండి. మీ కుటుంబాలను శోకంలో ముంచకండి. గంజాయిలో శీలావతి అనే రకాన్ని వైసీపీ నేతలు విదేశాలకు కూడా రవాణా చేస్తున్నారు. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి. గంజాయిని భారీగా పట్టుకొని తగులబెట్టినందుకు ఏకంగా అప్పటి డీజీపీ శ్రీ గౌతం సవాంగ్ గారిని వైసీపీ ప్రభుత్వం పక్కకు తప్పించిందంటే గంజాయిని ఎవరు ప్రొత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఆస్పత్రి వ్యవస్థను నిర్వీర్యం చేశారు
అమలాపురానికి చెందిన ఓ 24 ఏళ్ల ఆడబిడ్డను పాము కాటు వేస్తే ఇక్కడ ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యుడు లేరు. సిబ్బంది లేరు. వేరే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లే లోగా ఆమె మృతి చెందారు. అమలాపురంలాంటి ప్రాంతంలో పెద్ద ఆస్పత్రి లేదు. కోనసీమకు ప్రధానమైన కేంద్రంలో కేవలం ఏరియా ఆస్పత్రి మాత్రమే ఉంది. అక్కడ సరైన వసతులు, సిబ్బంది లేరు. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల వ్యవస్థను చంపేస్తోంది. ఆరోగ్యశ్రీ జపం చేసి, కనీసం ప్రభుత్వ వైద్యశాలల్లో వసతులను కల్పించడం మానేసింది. కోనసీమ చూడటానికి అందాల మేడలా కనిపిస్తున్నా, తాగే నీరు కూడా ఇక్కడ సక్రమంగా ఉండటం లేదని నాకు కొన్ని సమస్యలు విన్న తర్వాత అనిపించింది.
ఆక్వా కాలుష్యం భూమిలోకి వెళ్లి భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దీంతో వాటిని తాగిన మహిళలకు రకరకాల గైనిక్ సమస్యలు వస్తున్నాయి. వారికి వైద్యులు అందించే మందులు పనిచేయడం లేదు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోతోంది. దీంతో వైద్యులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఇక్కడి పాలకులు కనీసం ఈ సమస్యను అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోయారు.
జగన్ చిన్నపిల్లాడు అంట… ఏదో తెలియకుండా హామీ ఇచ్చాడంట
ఉద్యోగులు సీపీఎస్ రద్దు కోసం అలుపెరగకుండా పోరాటం చేశారు. 2019 ఎన్నికల ముందు జగన్ రెడ్డి గారు తమ ప్రభుత్వం రాగానే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జీపీఎస్ అంటూ రకరకాల నాటకాలు ఆడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నవారు చెప్పేదేమంటే జగన్ చిన్నపిల్లాడు… తెలిసోతెలియకో హామీ ఇచ్చాడని చెబుతున్నారు. నోట్లో వేలు పెడితే కొరకలేని ఈ ముఖ్యమంత్రి పసిబాలుడు. ఇప్పుడు సీపీఎస్ గురించి అడిగితే నాయకులకు ప్రభుత్వం నుంచి బెదిరింపులు, తిట్లు, శాపనార్థాలే ఎదురవుతున్నాయి. జనసేన ప్రభుత్వంలో సీపీఎస్ రద్దు. మీద నిపుణులతో కమిటీ వేసి, సమస్యను పరిష్కరించే ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులను మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం. ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు రూ.2500 కోట్లు తన అవసరాలకు మళ్లించేసుకున్నారు. అలాగే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పోలీసులకు ఎస్.ఎల్, టి.ఏ., డి.ఏ.లు బకాయిలుపెట్టేశారు. ఇవి సుమారు రూ.1300 కోట్లు ఉంటాయి. మేము ఉద్యోగులకు అండగా ఉంటాం.
ఒక్క అవకాశం ఇస్తే మొత్తం ముంచేశాడు….
2019లో తనకు అవకాశం ఇవ్వాలని పదేపదే కోరిన జగన్ రెడ్డి మాటలను ప్రజలు సంపూర్ణంగా నమ్మారు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి… ఉద్యోగాల క్యాలెండర్ పేరుతో మోసం… రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని ద్రోహం… దళితులకు సంబంధించిన 23 పథకాలు తీసేసిన కుతంత్రం చేశారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలో 23 వేల మహిళలు అదృశ్యం అయ్యారు… ఒక్క అవకాశం ఇస్తే ఒకటో తారీఖున జీతాలు లేకుండా చేశాడు.. ఒక్క అవకాశం పుణ్యమా అని అందరి మధ్య గొడవలు లేపాడు. సొంత చిన్నాన్నను చంపిన వారిని పట్టుకోకుండా, ఆయన కూతురిపై నెపం నెట్టే ఆలోచన చేశాడు. ఇలా ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఎన్నో ఘోరాలు.. ఇంకెన్నో కష్టాలు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొవల్సి వచ్చింది.
జనసేన పోరాటతత్వమే వైసీపీ వణుకుకు కారణం
151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వారు కదా..? 30 మంది ఎంపీలు ఉన్న వారు కదా..? మీరు బలవంతులు.. సిరుమంతులు కదా..? మరి ఇంతటి గొప్పవారికి జనసేన అంటే భయమెందుకు..? ఒకసారి ఆలోచించండి. జనసేన నిజాయతీ గల పార్టీ. తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నించే పార్టీ. పాలకుల అవినీతిపై పోరాటం చేయగల పార్టీ. అందుకే వారికి అంత భయం. మనం పోరాటం చేస్తే వెంటనే రైతులకు డబ్బులు వేస్తారు.. రోడ్లను బాగు చేస్తారు.. అప్పటి వరకు కాని పనులను సైతం పూర్తి చేస్తారు. మన జనసేన బలగంలోని తెగువ, పోరాటం, తిరగబడే సత్తా, ప్రశ్నించే శక్తి, పదిమందిని కలుపుకొని వెళ్లే ప్రేమ అంటేనే పాలకులకు భయం. దానిలోనే ఓ శక్తి దాగుంది.
యువతపై కేసులు ఎత్తివేయండి
కోనసీమ అల్లర్ల విషయంలో ప్రభుత్వం నాటకం ఆడుతోంది. కేసులను ఎత్తి వేసినట్లు ప్రకటనలు ఇస్తూనే క్షేత్రస్థాయిలో విభిన్న పంథాను అనుసరిస్తోంది. 250 మంది యువతకు కేసుల వల్ల భవిష్యత్తు లేకుండా పోయింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతరం కేసుల వల్ల భవిష్యత్తు కోల్పోయే ప్రమాదంలో ఉంది. మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెడతామంటే అంతా స్వాగతించేవాళ్లం. ఇతర జిల్లాలకు పేరు పెడుతున్నపుడు తీసుకోని అభిప్రాయ సేకరణ, కేవలం అంబేద్కర్ పేరు పెట్టినపుడు తీసుకోవడం ఎందుకు..? దీనిలో వైసీపీ కుట్రకోణం ఉందని అర్ధం అవుతుంది.
రైతాంగం ప్రతి బస్తాకు రూ.1530ల గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటోంది. ఎకరాకు అంతా సవ్యంగా ఉంటే రూ.10 వేల నష్టం వస్తోందని, కౌలు రైతులకు రూ.20 వేలు నష్టం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇంత నష్టం వస్తుంటే ఎందుకు సాగు చేస్తున్నారని రైతుల్ని అడిగితే, మాకు వేరే దారి లేదు అని చెబుతున్నారు. మాకు వేరు పనులు రావు అంటున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు అప్పులతో మునిగిపోయి ఆకలి తీర్చడం నిజంగా చింతించాల్సిన విషయం. రైతులకు కనీస సహాయం వైసీపీ ప్రభుత్వంలో అందడం లేదు.
ఆఖరికీ కాలువల్లో సిల్టు తీయకపోవడం చివరి ఎకరాకు నీరు అందని పరిస్థితి ఉంది. వైసీపీకి ఓటు వేసిన రైతులు సైతం నన్ను కలిసి తప్పు చేశామని, పశ్చాత్తాప పడుతున్నారు. కొబ్బరి రైతులకు జనసేన అండగా ఉంటుంది. ప్రస్తుతం బొండం ధర రూ.7 ఉందని చెబుతున్నారు. రూ.15 ధర అయితే గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. కొబ్బరి రైతులకు పూర్తిస్థాయి ధర దక్కేలా, ఈ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు వచ్చేలా నేను చొరవ తీసుకుంటాను. నేను ఓ రైతుని. నాకు రైతుల బాధలు తెలుసు. ఈ సారి జనసేన ప్రభుత్వానికి రైతాంగం అండగా నిలబడండి. కచ్చితంగా రైతాంగం చిరునవ్వులు చిందించే సుభిక్ష ఆంధ్రప్రదేశ్ ను తీసుకొస్తాం.
యువతను నమ్మించి మోసం చేశారు
వైసీపీ ప్రభుత్వం రాగానే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన పెద్ద మనిషి తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పటి వరకు క్యాలెండర్లు మారిపోయాయి తప్ప ఉద్యోగాలు రాలేదు. జాబ్ క్యాలెండరు ఇస్తామని చెప్పిన వ్యక్తి మాట తప్పితే, మోసం చేస్తే యువతకు ఎందుకు కోపం రాదు..? జనవాణిలో ఓ దళిత యువకుడు నా దగ్గరకు వచ్చి ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నం చేశాను. అయితే నోటిఫికేషన్ గతంలో ఇవ్వకపోడంతో వయసు మీరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పాపం ఈ వైసీపీ ప్రభుత్వానిది కాదా..? దీనికోసం యువత ప్రశ్నించాలి.
దివ్యాంగులనీ వేధిస్తున్నారు
వైసీపీ నాయకులు ఎంత నీచానికి దిగజారారు అంటే కూర్చున్న చోటు నుంచి కదల్లేని దివ్యాంగులను కూడా బెదిరిస్తున్నారు. కడప జిల్లా సిద్ధవటంలో జరిగిన జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు ఒక దివ్యాంగుడు, ఆయన తల్లి రావాల్సి ఉంది. వైసీపీ నాయకులు బెదిరించడంతో వాళ్లు రాలేకపోయారు. సభకు వెళ్తే ఆర్థికంగా కాస్త ఆసరా దొరుకుతుందని చెబుతున్నా… సంక్షేమ పథకాలు తీసేస్తాం అని బెదిరించి వాళ్లను సభకు రాకుండా చేశారు. ఇది ఒక్క కడప జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కొన్ని చోట్ల దివ్యాంగులకు పింఛన్లు పీకేస్తున్నారు. కరెంటు బిల్లు, ఇంకేవో కారణాలు చెప్పి పింఛన్లు తొలగిస్తున్నారు. కాకినాడలో ఒక దివ్యాంగుడు నన్ను కలవడానికి వస్తే ఆ అబ్బాయిపై జోకులు వేస్తున్నారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు తూలనాడున్నారు. ఇప్పుడు మీరు దివ్యాంగులను ఎంత క్షోభ పెడుతున్నారో… భవిష్యత్తులో అంతకంత అనుభవిస్తారు.
కోనసీమ నుంచే మార్పు మొదలవ్వాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అంటే ఆ మార్పు కోనసీమ నుంచే మొదలవ్వాలి. జీఎంసీ బాలయోగి గారు ఒక్కరు తలుచుకుంటూనే ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి చెందింది. కోనసీమ చిరకాల వాంఛ అయినా కోనసీమ రైల్వే లైన్ ను ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను. గ్రీన్ ఫీల్డ్ పోర్టు, కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు, నిజాంపట్నం పోర్టులను కలుపుటూ కోస్తా రైలు మార్గాన్ని నిర్మించాలనే ప్రతిపాదనపై జనసేన కచ్చితంగా ముందుకు వెళ్తుంది. జనసేన ప్రభుత్వం రాగానే కోనసీమ రైల్వే లైన్ ను కేంద్రంతో మాట్లాడి తీసుకొస్తాం. కోనసీమ పచ్చటి నేలను ఆయిల్ కంపెనీలు ధ్వంసం చేస్తున్నాయి. గెయిల్, ఓన్జీసీ, రిలయన్స్, వేదాంత్ సంస్థలు ఇక్కడి వనరులను తోడుకెళ్లిపోతున్నాయి తప్ప… స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు. లాభాల్లో 2 శాతం ఇక్కడ అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆ సొమ్మును ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఆయిల్ కంపెనీలతో మాట్లాడి స్థానిక యువతకు 70 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం.
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్సు
జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా, వైద్యాన్ని సంపూర్ణంగా ప్రభుత్వమే భరిస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తాం. దురదృష్టవశాత్తు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబానికి ప్రమాద బీమా కింద రూ. 5 లక్షలు అందిస్తూ ఆర్థికంగా భరోసా ఇస్తున్నాం. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ చేయిస్తాం. కేవలం ఆరోగ్యశ్రీ కొన్ని జబ్బులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే ప్రజలు తమకిష్టం వచ్చిన ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ సొమ్మును ప్రభుత్వమే భరించేలా ఏర్పాటు చేస్తాం. చిన్నపాటి పరిశ్రమలు పెట్టాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జనసేన ప్రభుత్వంలో సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ప్రతి ఔత్యాహిక పారిశ్రామిక వేత్తకు రాయితీలు కల్పిస్తాం.
క్లాస్ వార్ మీద ముఖ్యమంత్రికి మాట్లాడే హక్కు లేదు
ముఖ్యమంత్రి చేగువేరాలా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ అంటున్నాడు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సొంత డబ్బులు ఇచ్చిన నేనా పెత్తందారుడినా? లేక ప్రకృతి వనరులు దోచేసేవాడు, ఆడపిల్లలను అత్యాచారం చేసే క్రిమినల్స్ కు అండగా ఉండేవాడు, దళితులకు సంబంధించిన 24 పథకాలు తొలగించిన వారికి క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. ఆయనేమీ తరిమెల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, చారు మజుందార్ కాదు. అక్రమంగా డబ్బు సంపాదించిన ముఖ్యమంత్రి. మీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదు. కేవలం జనసేనకు మాత్రమే దానిపై మాట్లాడే అర్హత ఉంది” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.