Nadendla with JanasainiksNadendla with Janasainiks

ఇంటి నిర్మాణంలో పేదలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది
ఇసుకను వైసీపీ నాయకులు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు
టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్ జరగలేదు
నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్
తెనాలి నియోజకవర్గ పర్యటనలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్

‘పేదలకు ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానిది (YCP Government) దోబూచులాట ఆడుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు (Jagananna Colony), పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహాలు (TIDCO Houses) అర్హులైన పేదలకు చెందడం లేదు. దీని వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజలకు తెలిపేందుకు జనసేన పార్టీ (Janasena Party) నడుం బిగించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. తెనాలి నియోజకవర్గం పర్యటనలో భాగంగా కొల్లిపర గ్రామంలో మంగళవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ మీడియాతో (Janasena Press meet) మాట్లాడారు.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ జగనన్న గృహ నిర్మాణ పథకంపై (Jagananna Housing Scheme) పలు కీలక ఆరోపణలు చేసారు. “జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 12, 13, 14వ తేదీల్లో జరగబోయే జగనన్న ఇళ్ల పథకం సోషల్ ఆడిట్ (Janasena Social Audit) పక్కాగా నిర్వహిస్తాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రతి పైసా లెక్క తేలే విధంగా సోషల్ ఆడిట్ ఎలా చేస్తారో అదే విధంగా ఇళ్ల పథకంపై సోషల్ ఆడిట్ చేస్తాం. వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది.

క్షేత్రస్థాయిలో ఇల్లు కట్టుకునేందుకు పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో బయట పెడతాం. దీనిని ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో సహాయపడాలి. జనసేన పార్టీ చేపట్టబోయే సోషల్ ఆడిట్ కొత్త తరహాలో వాస్తవాలను తెలియజేసేదిగా ఉంటుంది. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేలా సమగ్రంగా నివేదికలు తయారు చేస్తాం అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

ఇళ్ల విషయంలోనూ మాట తప్పారు

రాష్ట్రం మొత్తం మీద రైతుల నుంచి, ఇతర పద్ధతుల ద్వారా భారీగా భూమిని సేకరించి వాటిని అసంబద్ధ రీతిలో పట్టాలు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పేదలకు ఇల్లు స్వయంగా నిర్మిస్తామన్న హామీ పూర్తిగా విస్మరించారు. జూన్ 2022 నాటికి రాష్ట్రంలో ఇల్లు పూర్తి చేస్తామని లక్ష్యంతో మొదటి విడతలో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. వాటిలో కేవలం 1,32,563 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. అంటే కేవలం 8 శాతం మాత్రమే పూర్తిచేసి, ఇళ్ల నిర్మాణం విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది. చాలా ప్రాంతాల్లో భూమిని సేకరించి అలాగే వదిలేసారు తప్పితే, అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న రూ.లక్ష 80 వేలతో కనీసం పునాదులు కూడా లేవలేని పరిస్థితి నెలకొంది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

దీంతో పేదలు ఎవరు ఇల్లు కట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. వారికి తగిన విధంగా సహాయం చేస్తామని చెప్పిన మాట ఇచ్చిన ప్రభుత్వం కూడా ఏమాత్రం స్పందించడం లేదు. కావాలని ఇసుక కొరతను సృష్టించి, బ్లాక్ మార్కెటింగ్ ద్వారా వైసీపీ నాయకులు ఇసుకను అమ్ముకుంటున్నారు. దీంతో పేదలకు ఇసుక దొరకడమే కష్టమైపోయింది. ఇసుక సమస్య వచ్చినప్పుడు ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పడం ప్రభుత్వం అలవాటు చేసుకుంది. తాజాగా ఇసుక కాంట్రాక్ట్ విషయంలోనూ మార్పులు, చేర్పులకు దిగింది. ఉన్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అదే పద్ధతిని నిర్మాణరంగం విషయంలోనూ అమలు చేస్తోంది. ఇక పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల ను లబ్ధిదారులకు రిజిస్టర్ చేయించడం లేదు. ఇళ్ల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పేదలు చితికి పోతున్నా, ఇళ్లను మాత్రం కేటాయించడం లేదు.

ఇది జగనన్న ఇళ్ల పథకంలా లేదు.. ఇల్లు గుల్ల పథకంలా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన మాట ఈ ముఖ్యమంత్రికి గుర్తుందా? లేక ప్రజలే గుర్తు చేయాలా చెప్పండి అంటూ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

మీకు వినే తీరిక లేదు…ఇంకెందుకు ఈ కార్యక్రమాలు?

ప్రతి జిల్లాలో ప్రతి వారం నిర్వహించే స్పందన కార్యక్రమంగానీ, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాలు ప్రజల సమస్యల వినడానికి ఉద్దేశించినవే. వాటిలోనే ప్రజల సమస్యలు తీరితే కొత్తగా “ముఖ్యమంత్రికి చెబుదాం” కార్యక్రమం ఎందుకు..? గతంలోనూ సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజల సమస్యలు నేరుగా వినేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అది అమలు కాలేదు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రికి చెబుదాం అంటూ కొత్త కార్యక్రమం తీసుకువచ్చారు. అసలు వినే తీరిక, ఓపిక లేనప్పుడు.. ప్రజలు సమస్యలు మీకు చెప్పడం దేనికి? ప్రజల్లోకి రావడానికి భయపడే ముఖ్యమంత్రి ఫోన్లో ప్రజల సమస్యలు వింటాను అంటే ప్రజలు నమ్ముతారా..? వారిని మరోసారి మోసం చేయకండి” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, ఇస్మాయిల్ బేగ్, బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. కొల్లిపరకు చెందిన జనసేన నాయకుడు వి.ఎస్.రామిరెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రామిరెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

వైసీపీ అణచివేతలని గట్టిగా ఎదుర్కొంటాం: జనసేన