Modi-Nitesh-BiharModi-Notiesh Josh in Bihar

సర్వత్రా వికసించిన మోడీ మంత్ర

అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ కమలం వికాసం (BJP) కొనసాగింది. బిహార్‌తో (Bihar) పాటు తెలంగాణ దుబ్బాక, (Telangana Dubbaka) మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), గుజరాత్‌ (Gujarat), ఉత్తర్‌ ప్రదేశ్‌(Uttar Pradesh) లలో భాజపా విజయ దుంధిబి (victory) మోగించింది. రాజకీయ పండితుల ఊహల్ని, ఎగ్జిట్‌పోల్స్‌ (Exit Polls) అంచనాల్ని పటాపంచలు చేసింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరదించింది.

బిహార్‌లో నీతీశ్‌ కుమార్ ‌(జేడీయూ)తో జట్టుకట్టిన కమలదళం, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించింది. ఆ కూటమికి 125 స్థానాలు లభించగా, గట్టి పోటీనిచ్చిన మహా కూటమి 110 స్థానాల వద్ద ఆగిపోయింది. బిహార్‌ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ‘మోదీ మంత్ర’ చక్కగా పనిచేసింది. ముఖ్యంగా బిహార్‌ శాసనసభ సమరంలో సాధించిన విజయం ఆ పార్టీకి రెట్టింపు ఉత్సాహాన్ని అందించింది.

కీలకమైన మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లోనూ కమలాన్నే విజయలక్ష్మి వరించింది. 28 స్థానాలకు గానూ 19 చోట్ల (ఆధిక్యం, గెలుపు కలిపి) కమలనాథులే దూసుకువెళ్లారు. గుజరాత్‌ ఉప ఎన్నికల్లో 8 స్థానాల్లోనూ భాజపా విజయాన్ని సాధించి బలాన్ని పరిపుష్టం చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు గానూ 6 భాజపా అభ్యర్థులకే దక్కాయి. ఉప ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాలు చేసికొంటున్నాయి. బిహార్‌లో వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో జేడీ(యూ) అభ్యర్థి విజయం సాధించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఏమాత్రం ఊహించని విధంగా బిహార్‌లో ఎన్డీయే కూటమి 125 సీట్లతో సాధారణ ఆధిక్యాన్ని సాధించింది. కాంగ్రెసుతో జతకట్టిన RJD కూటమి పోరాడి పరాజయం పొందింది. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు మించి ఈ కూటమిలో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. నీతీశ్‌ మార్క్‌ సుపరిపాలన, అభివృద్ధి పథకాల కొనసాగింపే లక్ష్యంగా ఎన్డీయే ఈ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించింది. మహా కూటమి ఎన్నో ఆశలు పెట్టుకున్నా చివరకు అధికారానికి కాస్త దూరంలో ఆగిపోయింది. ఒక దశలో ఎన్నికల ఫలితాలు సంకీర్ణ సర్కారుకు దారితీస్తాయా అనే సందేహానికి తెరతీశాయి. అయితే పార్టీల పరంగా ఆర్జేడీ అతి పెద్దదిగా నిలిచింది.

కాంగ్రెసులో ఉన్న నాయకత్వ లేమి, లాలూ లేని లోటు మరియు పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఆర్జేడీ కూటమికి ప్రచారంలో పాల్గొనక పోవడం లాంటి ఎన్నో విషయాల్లో ఆర్జీడీ కూటమి పరాజయానికి కారణాలుగా చెప్పవచ్చు.

ఫలితాలను ప్రభావితం చేసిన వ్యూహాలు!

ఎన్డీయే కూటమి (NDA) ఇచ్చిన హామీలు అయిన మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి హామీ పని దినాల పెంపు వంటి హామీలు అధికార కూటమి విజయానికి కారణమయ్యాయి. నీతీశ్‌ పాలన కన్నా మోదీ ప్రచార ప్రభావమే బాగా పనిచేసినట్లు కనిపిస్తున్నది. జేడీయూ కంటే భాజపా అధిక స్థానాల్లో గెలుపొందడమే ఇందుకు నిదర్శనం అని అంటున్నారు. ఆర్జేడీపై మోదీ చేసిన అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. బిహార్‌లో కీలకమైన దళితులు, ముస్లింలు, యాదవులపై గురిపెట్టడం ఎన్డీయేకు కలిసివచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామనే హామీ చాలావరకు పనిచేసిందనే చెప్పాలి. నితీష్ కుమార్’ని (Nitish Kumar) ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడుతూనే, బీజేపీ తమ పార్టీని బలోపేతం చేసుకోవడంపైనా దృష్టి సారించింది. జేడీయూ (JDU) పట్ల ఉన్న అసంతృప్తి తమకు ఇబ్బంది తీసుకురాకుండా బీజేపీ జాగ్రత్తపడింది. ఎల్జేపీ విడిగా పోటీచేసి ఓట్లు చీల్చడం కూడా భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు దోహదపడింది. వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నా, ఎవరివైనా, రాష్ట్ర రాజకీయాలను భాజపా కీలక మలుపు తిప్పిందన్నది మాత్రం నిజం.

Spread the love