Janasena varahi in EluruJanasena varahi in Eluru

తెలియకుండా చేసిన రూ.1.18 లక్షల కోట్ల అప్పుతో ఏంచేశావ్
కాగ్ సంధించిన 25 ప్రశ్నలకు బదులేది?
ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే నన్ను తిట్టడమే రాజనీతినా
జగన్… ఓ చెత్త ముఖ్యమంత్రి. సీఎంగా అనర్హుడు
పరదాల మాటున బయటకు వచ్చే మహారాణిలా ముఖ్యమంత్రి
వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతోంది
కీలక సమాచారం బయటకు వెళ్లడం వల్లనే మహిళల అక్రమ రవాణా
మహిళల అదృశ్యం, అక్రమ రవాణా వెనుక వైసీపీ నేతలు?
ఆఖరికి చెత్తపై పన్ను వేసే జగన్ కీ దోపిడీ దొంగకీ తేడా లేదు.
బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టే వారిని నమ్మి మోసపోవద్దు
వారాహి విజయయాత్ర ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్

జనసేసిన వారాహి యాత్రలో భాగంగా ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ అవకతవక లెక్కల బాగోతాన్ని ఏలూరు సాక్షిగా బయటపెట్టారు. ‘జగన్ ఎక్కడి నుంచో ఊడి పడలేదు.. మన కంటే ఎక్కువ కాదు. ప్రజల్లో ఒకడు. మనం స్వేదం చిందించి కట్టిన పన్నులకు ధర్మకర్తగా ఉండాలని మాత్రమే ఆయనను నమ్మి బాధ్యతలు అప్పగించాం. దానిని జగన్ నిలబెట్టుకోలేకపోయారు’ అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఏలూరు బహిరంగ సభలో స్పష్టం చేశారు.

ప్రజలంతా జగన్ బానిసలు కాదు.. ఆయన నియంత పాలనలో ప్రజలంతా చెప్పినట్లు వినే పాలేర్లు కాదని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ రూ. 10 లక్షల కోట్లకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన జగన్ ఆ బాధ్యతను విస్మరించారన్నారు. ప్రజలకు తెలియకుండానే రూ.1.18 లక్షల కోట్ల అప్పు చేసి, దానికి కనీసం లెక్కలు కూడా సరిగా చెప్పని జగన్ ముఖ్యమంత్రి పదవికి పూర్తిగా అనర్హుడన్నారు. ఆయనకు పాలించే అర్హత లేదు.. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి హోదాకు నేను ఎల్లపుడూ పూర్తి గౌరవం ఇచ్చేవాడిని. ఆ స్థానానికి ఉన్న విలువ అలాంటిదని తెలిపారు. జగన్ మీద ఎన్ని విమర్శలు చేసినా, ఆయనను ‘గారు’ అని సంబోధించేవాడిననీ.. అయితే దిగజారి మాట్లాడటం చూస్తే ఆయన తీరు మీద అసహ్యం కలిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థల విచ్ఛిన్నం, చట్టాల ఛిన్నాభిన్నం అవుతున్న తీరు చూశాక ఇక నుంచి జగన్ అని ఏకవచనంతోనే సంబోధిస్తానని ప్రకటించారు. నువ్వు అని పిలిస్తూ మాట్లాడతానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

వారాహి విజయయాత్ర రెండో దశ బహిరంగసభ ఆదివారం ఏలూరు నగరంలో జరిగింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “హలో ఏపీ బైబై వైసీపీ నినాదం అన్నది కేవలం సరదాగా ఇచ్చిన నినాదం కాదు. దాని వెనుక ఎంతో సంఘర్షణ, మదనం దాగున్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వం 2024లో ఇంటికి వెళ్లకపోతే జరిగే వినాశనం అంతా ఇంతా కాదు. అందుకే ఎంతో ఆలోచించిన తర్వాతనే ఆ నినాదాన్ని నేను ఇచ్చాను. దేశంలోని అన్ని రాష్ట్రాల బడ్జెట్, వాటి ఖర్చులు, కేటాయింపులు, జమలు, ఇతరత్ర వ్యవహారాలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది. ప్రతి ఏటా వీరు ఆయా రాష్ట్రాల తాలుకా లెక్కలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత, వారి అభిప్రాయాలను, లోపాలను తెలుపుతారు. 2021- 22 ఆర్ధిక సంవత్సరానికి కాగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కలను చూసి 25 లోపాలను ఎత్తి చూపింది.

వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న లెక్కల గారడీను, ప్రజలకు తెలియకుండా చేసిన అప్పుల కుప్పలను, సంక్షేమ పథకాలకు మళ్లించిన గారడీ బాగోతాలను కూడా బయటపెట్టింది. వీటిని చూస్తే ప్రజాధనం అంటే వైసీపీకి ఎంత లోకువ అనేది అర్ధం అవుతుంది. వైసీపీ నాయకుడు రాష్ట్రాన్ని ఎంత అధోగతి పట్టిస్తున్నాడో సహేతుకంగా తెలుస్తుంది.

ఈ లెక్కలకు జవాబు చెప్పు జగన్

చరిత్రను సమతూకంగా అంచనా వేస్తే భవిష్యత్తు మీద స్పష్టత వస్తుందంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజా పహరా లేకపోతే దుర్మార్గుల దాష్టీకాలు మొదలవుతాయంటారు. కాగ్ చెప్పిన లెక్కల ప్రకారం రూ.1.18 లక్షల కోట్లను వైసీపీ ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో చూపించలేదు. అంటే బడ్జెట్ లో సుమారు 10 శాతం సొమ్మను ప్రజలకు తెలియకుండానే వివిధ రకాలుగా ప్రభుత్వం అప్పు చేసింది. అంటే ఇంటికి పెద్దగా ఉన్న వ్యక్తి ఇంట్లోని వారికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆ ఇంటిపై భారీగా అప్పులు చేస్తే ఎంత తప్పో ఇది అంతే. పోని అప్పులు తీసుకొచ్చిన సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టావు.. ఎంత ఖర్చు పెట్టావు అని అడిగినా దానికి సమాధానం లేదు. ఆ తీసుకున్న అప్పును ఏం చేశావ్ జగన్..? లెక్క చెప్పు.

కల్లబొల్లి సంస్థలతో అప్పులు ఎందుకు..? దేనికోసం

జగన్ విను.. నీవు చేసిన ఘనకార్యాలు విను. కల్లబొల్లి సంస్థలను పెట్టి అప్పుల కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించేలా చేశావు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.22,504 కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఈ డబ్బును ఖర్చు చేశారో లెక్కలేదు. ఉపాధి, ఉద్యోగం, మానవ వనరుల అభివృద్ధి, ఇతర అంశాలకు వాడాల్సిన ఈ నిధులు ఎటు వెళ్లాయి..? ఎవరికి ప్రయోజనం అందింది..? లెక్క చెప్పాలి. రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.4,754 కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. గుంతల రోడ్లు, నడుములు విరిగిపోయే తీరుతో ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. విచ్చలవిడిగా కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పుల సొమ్ము ఏమయింది..? ఎవరికి అందిందో వైసీపీ ప్రభుత్వం బహిరంగంగా చెప్పాలి.

సర్దుబాటు అంటే సర్వం మింగేయడమా..?

కాగ్ చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకు లెక్క చెప్పకుండా సర్దుబాటు పేరుతో పక్కదోవ పట్టించిన సొమ్ము రూ.11,237 కోట్లు. 2 లక్షల సర్దుబాట్లు ఈ నిధులకు ఉన్నాయని చెప్పారు. అయితే వీటికి సరైన లెక్కలు, పత్రాలు ఇప్పటికీ సమర్పించలేదు. ఇంట్లో అనుకున్న దానికంటే అధిక ఖర్చు లేదా కొత్త ఖర్చు తగిలితే ముందుగా అనుకున్న బడ్జెట్ ను సర్దుబాటు చేసి, కొత్త బడ్జెట్ లో లెక్క చూపుతాం. మరీ సర్దుబాటు బిల్లులకు ఎందుకు లెక్కలు లేవు..? దీనికి కూడా జగన్ కచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే.

సంక్షేమం అంటే డబ్బులు పంపిణీ అనే భ్రమలో ఉన్న జగన్ కు సంక్షేమం తాలుకా అసలు విషయాలు అర్ధం కావు. బడ్జెట్ లో సంక్షేమం కోసం ఇతరత్ర విషయాలకు కేటాయించిన నిధులను దారి మళ్లించడం మాత్రమే తెలుసు. ధరల స్థిరీకరణ కోసం కేటాయించిన రూ.3 వేల కోట్లు ఏమయ్యాయి..? రైతు పెన్షన్ కానుక కోసం కేటాయించిన రూ.1800 కోట్లు ఎటు పోయాయి..? ఆస్పత్రులు నిర్వహణ కోసం వెచ్చించిన రూ.390 కోట్లకు లెక్కలేవి..? ఇవేవి సంక్షేమం లెక్కలోకి రావా..? ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. యంత్రాలు లేవు. అన్నిటికీ ఆరోగ్యశ్రీ మంత్రదండం కాదు. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాల కోసం కేంద్రం రూ. 250 కోట్లు ఇస్తే, వాటిని మళ్లించారు. ఆస్పత్రులను గాలికి వదిలేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే వికలాంగుల శాఖ కోసం రూ.537 కోట్ల బడ్జెట్ సొమ్మును వారికి రూపాయి కూడా వినియోగించలేదు. ఈ డబ్బంతా ఏమైంది..? ఎటు వెళ్తుంది..? దీనికి కచ్చితంగా జగన్ లెక్క చెప్పాల్సిందే. ఇవన్నీ ప్రజల సమస్యలు.

అమ్మనీ, నా భార్యనీ, పిల్లల్నీ తిట్టిస్తున్నారు

వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలు. ప్రజాధనం కాపాడేందుకు, ప్రజల తరఫున జగన్ కు నేను సంధించే ప్రశ్నలు. వీటికి సూటిగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేకనే నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తాను. కనీసం ఇంట్లో నుంచి బయటకు రాని మా అమ్మను, నా భార్యను, పిల్లలను సైతం చెప్పలేని బాషలో తిడతారు. నేను ప్రజల కోసం అన్నీ పడతాను. కచ్చితంగా వీరిని వదలకుండా ప్రశ్నిస్తుంటాను.

అవినీతిపై నివేదిక ఇస్తే బదిలీ బహుమతి

ఏలూరు నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల్లోనూ జరుగుతున్న అవినీతి మీద 1800 పేజీల రిపోర్టును ఐఏఎస్ అధికారి అరుణ్ బాబు ప్రభుత్వానికి ఇస్తే ఇప్పటి వరకు దాని మీద చర్యలు లేవు. ఇచ్చిన నివేదిక ఏమైందో తెలియదు. వైసీపీ నాయకులు చేసిన తప్పులను సివిల్ సర్వీస్ అధికారులు ఎత్తిచూపినా పాలకుల నుంచి స్పందన ఉండదు. బహుమతిగా బదిలీ చేస్తారు. ఏలూరు నగరంలో 300 మందికి వింత వ్యాధి సోకి అప్పటికప్పుడు మూర్చపోతే అసలు దానికి కారణం ఏమిటో, వచ్చిన నివేదికలు బయటపెట్టిన దాఖలాలు ఉండవు. 3 వేల మంది కార్మికులకు దారి చూపే శ్రీ కృష్ణా జ్యూట్ మిల్ సమస్యకు పాలకులు దారి చూపలేకపోయారు.

ఏలూరు నగరానికి తమ్మిలేరు వరద నుంచి రక్షణ ఇచ్చే గోడను ఇన్ని సంవత్సరాలు కావొస్తున్నా నిర్మించలేకపోయారు. అన్నింట్లో అభివృద్ధి సాధించిందని చెప్పుకునే ఏలూరు నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేదు. దీనికోసం రూ.8 కోట్ల ప్రతిపాదనలు కాగితాలకు పరిమితం అయ్యాయి. నగరవాసుల కల అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఏళ్లు గడుస్తున్నా మోక్షం లేదు. ఇలాంటి ఏలూరు నగరానికి ఎన్నో సమస్యలున్నాయి.

బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టే వారిని నమ్మి మోసపోకండి.. కచ్చితంగా మనకు ఎవరు నిలబడతారు..? మన సమస్యల్ని నిజాయతీతో ఎవరు తీరుస్తారు అని ఆలోచించి జనసేనకు నిలబడండి. విద్యా, వైద్యం, ఉపాధి కోసం జనసేన పార్టీ కట్టుబడి ఉంది. నా అంతిమ లక్ష్యం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఈ మూడు అందేలా చూడటానికి కట్టుబడి ఉంటాను.

కొల్లేరు పరిరక్షణకు జనసేన నిలబడుతుంది

జనసేన మూల సిద్ధాంతం అయిన పర్యావరణ పరిరక్షణ అభివృద్ధికి మేం కట్టుబడి ఉంటాం. ఒకప్పుడు సుమారు 20 లక్షల పక్షులతో, 65 రకాల మందులు చేపలజాతులతో కళకళలాడే కొల్లేరుకు కచ్చితంగా పునర్వైభవం తీసుకొస్తాం. కొల్లేరు నీరు
బయటకు వెళ్లే దారి లేక ఇప్పటికీ 75 గ్రామాలు నిత్యం ముంపులో మునిగిపోతున్నాయి. ఈ సమస్యలను తీర్చేందుకు కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేసి, కొల్లేరు అభివృద్ధికి కట్టుబడి జనసేన పని చేస్తుంది. ఒకప్పుడు కేవలం 3 శాతం ఉప్పు నీరుగా ఉండే కొల్లేరులో ఇప్పుడు 12 శాతం ఉప్పు లవణాలు రావడం ప్రమాద సంకేతం. విషతుల్యంగా మారుతున్న కొల్లేరు పరిస్థితిని అంచనా వేసి, దాని పరిరక్షణకు జనసేన కట్టుబడి ఉంటుంది.

మద్యంలో రూ.30 వేల కోట్లకు లెక్కల్లేవ్

రాష్ట్ర అభివృద్ధి చెందడం అంటే జగన్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలు అభివృద్ధి చెందడం కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. కనీస మౌలిక వసతులు మెరుగవ్వాలి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి. ఒకవైపు రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు వందల కోట్లకు పడగలెత్తు తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి ఒక్క మద్యం మీదనే రూ.1.25 లక్షల కోట్లు ఆదాయాన్ని ఆర్జించాడు. ఇందులో రూ. 97 వేల కోట్లకే లెక్కలు చూపించి దాదాపు రూ. 30 వేల కోట్లు దోచేశారు.

ఈ డబ్బును వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓట్లు కొనడానికి ఉపయోగిస్తారు. వీళ్ల దోపిడీకి అడ్డు వస్తోందని ప్రభుత్వ మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ను తీసేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం తాగి జంగారెడ్డిగూడెంలో 32 మంది చనిపోయారు. 32 మంది ఆడపచుడుల మెడలో తాళిబొట్లు తెంపేసిన ప్రభుత్వం ఇది. జగన్… నువ్వు తెంపేసిన తాళిబొట్లు ఇవి. వారి వేదన, గుండె ఘోష ఊరికనే పోదు.

పరదాల చాటున దాక్కునే మహారాణిలా ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి మాట్లాడితే నేను హైదరాబాద్ లో ఉంటాను. సినిమా షూటింగులకు వెళ్తాను అంటాడు. ఆయనలా నాకు అక్రమ సంపాదన లేదు. ఆయన నాన్నగారిలా మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు. ప్రతి సాగునీటి ప్రాజెక్టులో 6 శాతం పర్సంటేజ్ తీసుకోలేదు. మా నాన్న ఏదో చిన్న ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. నేను సినిమా చేస్తే వచ్చిన డబ్బులతోనే ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం. అదే డబ్బుతో పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. నిజాయతీగా నా రెక్కల కష్టంతో సంపాదిస్తున్నాను. అంతే తప్ప నీలా తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేయలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఒక్క ప్రెస్ మీట్ పెట్టడం చూశారా?

ఆయనకు మీడియాతో మాట్లాడాలంటే వణుకు. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని దడ. ఆయన పాలనా లోపాలను ఎక్కడ బయటకు తీస్తారోనని భయం. బహిరంగ సభలకు వెళ్లినా మహారాణిలా ఎవరికి కనిపించకుండా పరదాల చాటున దాక్కొని వెళ్తారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏ పల్లెకు వెళ్లని దానికి ఆయన తాడేపల్లిలో ఉంటే ఏంటి? దాచేపల్లిలో ఉంటే ఏంటి?

జీవోలను బయటపెట్టని చీకటి ప్రభుత్వం

భారతదేశం టిక్ టాక్, చైనా ఫేస్ బుక్ బ్యాన్ చేస్తే… జగన్ ప్రభుత్వం జీవోలను బ్యాన్ చేసింది. ఇచ్చిన జీవోలన్నీ రహస్యంగా ఉంచుతున్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయాక రహస్యంగా ఉంచిన జీవోలన్నీ బహిర్గంతం చేస్తాం. జగన్ ఏ ఊరులో దాక్కున్నా ప్రజలకు సమాధానం చెప్పేలా చేస్తాం. 2021-22 సంవత్సరంలో దాదాపు 37,942 రోడ్డు ప్రమాదాలు జరిగితే… అందులో 14,౨౩౦ మంది చనిపోయారని డీజీపీ గారు చెప్పారు. అంటే ప్రతి మూడు యాక్సిడెంట్లకు ఒకరు చనిపోయారు. ఈ ప్రభుత్వం రోడ్లు సక్రమంగా వేస్తే ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కాదు. రోడ్లు వేయనికాడికి రహదారుల అభివృద్ధి సంస్థ నుంచి అప్పులు తెచ్చి ఏం చేశారు..?

చెత్తను శుభ్రం చేసే రెల్లి కార్మికుల నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేస్తున్న చెత్త ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. అనాధ శవాలకు దహన సంస్కారాలు చేస్తున్న వారిపై కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం దాడికి పాల్పడింది. ఫ్లాష్ సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు భద్రం చేసే గోదాంను కూలగొట్టింది.

మహిళల అక్రమ రవాణాకు అదే కారణం

వైసీపీ అధికారంలోకి వచ్చాకా దాదాపు 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయి పోయారు. వారిలో 12 నుంచి 14 వేల మందిని కాపాడామని పోలీసులు చెబుతున్నారు. కాపాడిన వారిని పక్కన పెడితే మిగిలిన వారి సంగతి ఏంటి? ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ, డీపీజీ కానీ దీనిపై ఒక్క సమీక్ష చేయలేదు. ముఖ్యమంత్రి ఇంట్లో ఆడపడుచులు మిస్ అయితే ఇలానే స్పందిస్తారా? ఈ మిస్సింగ్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంతస్థాయిలో మానవ అక్రమ రవాణా జరడానికి కారణం గ్రామ వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న సమాచారమే. రహస్యంగా సేకరిస్తున్న సమాచారం కొన్ని అసాంఘిక వర్గాలకు చేరుతోందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఏ కుటుంబంలో ఎంతమంది ఆడవారు ఉన్నారు. వారిలో ఒంటరి మహిళలు ఎంతమంది వంటి సమాచారం అసాంఘిక, సంఘ విద్రోహ శక్తులకు చేరడం వల్లనే మానవ అక్రమ రవాణా పెరిగిపోయిందని చెప్పారు. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని చెప్పారు. దీనిపై మీడియా కూడా దృష్టి సారించి, అసలు విషయాలు బయటకు తీయాలి.

ఇంతమంది ఆడపడచుల ఉసురు తీస్తున్న జగన్ ప్రభుత్వం తప్పక శిక్ష అనుభవిస్తుంది.
దారి దోపిడీ చేసే దొంగలకు… చెత్త పన్నుతో సహా అన్ని రకాల పన్నులను వేసి ప్రజలను దోచేస్తున్న జగన్ కు పెద్ద తేడా లేదు. ఇది నా నేల, నా సమాజం, నా దేశం అని అన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాను. గెలిచినా, ఓడిపోయినా నా పోరాటం ఆగదు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. నా తల్లిని, భార్యను, బిడ్డలను తిడితే భయపడతాను అనుకోకు. జగన్ నువ్వు విలువలు లేనివాడిని, క్రిమినల్ అని తెలుసు. మా దురదృష్టం ఏంటంటే నీలాంటి వాడు ముఖ్యమంత్రి కావడమే. పోలీసులను కొట్టిన నీకు డీజీపీ, పోలీస్ వ్యవస్థ సెల్యూట్ చేస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు మనందరం కలిసి కృషి చేయాలి.

చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు వచ్చారు వెళ్లిపోయారు. ప్రజల కోసం పనిచేసిన వారు మాత్రమే గుర్తుంటారు. పదవుల కోసం వెంపర్లాడితే పదవులు రావు. సమాజంలో మార్పు కోసం నిస్వార్ధంగా పోరాటం చేస్తే అధికారం దానంతట అదే వస్తుంది. ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. మన భవిష్యత్తు మారేలా నిర్ణయం తీసుకోండి” అని జనసేనాని అన్నారు.

కష్టపడి పనిచేస్తే అధికారం జనసేన పార్టీదే: పవన్ కళ్యాణ్

Spread the love