Nadendla at BhimavaramNadendla at Bhimavaram

నీరుపేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) పెద్ద మోసం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. నవరత్నాల్లోను… ఇచ్చిన హామీల్లోనూ అన్నీ నెరవేర్చేశామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నది. అలానే పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా మోసం చేస్తోందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ అని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎన్ని ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చారో చెప్పాలి అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

తూతూ మంత్రంగా సమీక్షలు, కోట్లు ఖర్చు చేసి పక్రటనలు తప్పితే క్షేత్రస్థాయిలో పురోగతి శూన్యమని మనోహర్ అన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో కేవలం 8 శాతం ఇళ్లను మాత్రమే పూర్తి చేసిన మాట వాస్తవం కాదా అని మనోహర్ ప్రశ్నించారు. కేంద్రం నిధులు సమకూర్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకంలో మంజూరైన ఇళ్ళలో కేవలం అయిదు మాత్రమే నిర్మించడం చూస్తే వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థం అవుతోంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయం (Janasena Party Office) నుంచి వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ వీడియోలో పేదల గృహ నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వ అలసత్వాన్ని, చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తన పార్టీ మ్యానిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పేదలకు 31 లక్షల మందికి 2023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమీక్ష సమావేశంలో కూడా నిజాలను తొక్కిపెట్టి, ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటనలు చేశారు అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

పేదల ఇళ్లకు ఇసుక కూడా ఇవ్వడం లేదు

వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చాక ‘పేదలందరికీ ఇళ్లు’ అనే పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,63,562 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. ఈ మూడున్నరేళ్లలో కేవలం 1,52,325 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. అంటే మొత్తంగా చూసుకుంటే 8 శాతం మాత్రమే పనులు జరిగాయి. దాదాపు 80 శాతం ఇళ్లు పునాదులకే పరిమితమయ్యాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమే. కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి ఏడాది రూ. 4 వేల నుంచి 5 వేల కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తుంటే… ఆ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.1,547 కోట్ల గృహ నిర్మాణ నిధులు దారి మళ్లించింది అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

మాట్లాడితే అధికార పార్టీ నాయకులు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే అద్భుత నగరంగా విశాఖను మార్చేస్తామని చెబుతున్నారు. అలాంటి విశాఖ జిల్లాకు కేటాయించిన ఇళ్లు 1,39,338. ఇందులో ఒక్కటంటే ఒక్క ఇంటిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. పునాదుల దశలోనే ఇళ్లు 8,881 ఉన్న మాట నిజం కాదా? ఏ జిల్లా తీసుకున్నా ఇదే పరిస్థితి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పూర్తి చేసిన ఇళ్లు కేవలం ఐదంటే ఐదు మాత్రమే. ఈ విధంగా ఆయన పాలన సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఈ మూడేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ. 22,737 కోట్లు విడుదల చేస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. 4915 కోట్లు మాత్రమే. మిగతా సొమ్మును ఇతర పథకాల కోసం దారి మళ్లించడంతో పేదోడి సొంతింటి కల తీర్చలేక ప్రభుత్వం చతికిల పడింది.పేదల ఇళ్ల నిర్మాణానికి కనీసం ఇసుక కూడా అందుబాటులో ఉంచడం లేదు. హౌసింగ్ కాంట్రాక్టర్లకు రూ.800 కోట్లుపైగా బకాయిలు పెట్టారు అంటూ నాదెండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు.

టిడ్కో లబ్ధిదారులను ఇబ్బందుల పాల్జేశారు

రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నాయి. ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొన్న లబ్ధిదారులు ఇటు ఇళ్లు రావడం లేదు. అటు నెల నెల ఈఎంఐలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. టిడ్కో లబ్ధిదారులకు రూ. 4107 కోట్ల రుణాలు రావాలి. ఇప్పటి వరకు లబ్ధిదారులకు మంజూరైనవి రూ. 1373 కోట్లు మాత్రమే. ఈ దుస్థితికి కారణం జగన్ ప్రభుత్వ నిర్వాకమే. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష, సమావేశాల్లో వాస్తవాలు బయటకు రావడం లేదు. సంబంధిత శాఖ మంత్రి కూడా కల్లబొల్లి కబుర్లతో, అర్థం లేని విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప పేదల ఇళ్ల నిర్మాణంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. అధికారికంగా మేము సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందుపెడుతున్నాం. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా జగనన్న కాలనీల్లో ఎందుకు కనీస మౌలిక వసతులు కల్పించలేకపోయారు? రోడ్లు ఎందుకు వేయలేకపోయారు? గ్రౌండింగ్ ఎందుకు చేయలేకపోయారు అన్నదానిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో గృహ నిర్మాణంపై ప్రజా క్షేత్రంలోనే వైసీపీని ఎండగడతాం” అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మద్ది ఆంజనేయ ఆలయంలో కార్తీకమాస మహోత్సవములు