SavepanchayatsinapSavepanchayatsinap

నిర్మాణంలేని పార్టీ వాలంటీర్ల వ్యవస్థ సాయంతో ముందుకు వెళ్తుంది
రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ అస్తవ్యస్థం
గ్రామ ముఖ్యమంత్రులు గ్రామాలు వీడుతున్నారు
పంచాయతీలు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు
గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధం
సర్పంచుల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ కృషి చేయాలి
సర్పంచుల చర్చా ఘోష్టిలో చెల్లప్ప, ప్రొ.ఈ. వెంకటేష్, లక్ష్మణ రెడ్డి

వైసీపీ పాలనలో గ్రామాలకు ముఖ్యమంత్రులుగా ఉండాల్సిన సర్పంచులు గ్రామాలను వీడి పోతున్న దుస్థితి నెలకొందని మద్యపాన విమోచన ప్రచార కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవస్థ మినహా అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయాయన్నారు. గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయాల రూపంలో సమాంతర వ్యవస్థలను తీసుకువచ్చి పాలన సాగిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీరాజ్ వ్యవస్థ దారుణంగా దెబ్బతిందన్నారు.

శనివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పంచాయతీలను కాపాడుకుందాం అనే అంశంపై జరిగిన సర్పంచుల చర్చా ఘోష్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ 65 శాతం ప్రజానీకం గ్రామాల్లోనే జీవనం సాగిస్తున్నారు. గ్రామాలు బలోపేతం కావాలని గ్రామ స్వరాజ్యం గురించి గాంధీజీ కన్న కలలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పంచాయితీలకు ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో ఒక్క అంశంలో అయినా ఆంధ్రప్రదేశ్ పేరు వినబడకపోవడం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. పంచాయితీలకు ప్రత్యామ్నాయంగా వాలంటీర్లు పాలన ముందుకు తీసుకువెళ్తున్నారు. సర్పంచ్ పిలిస్తే వాలంటీర్ రాడు, సచివాలయ సిబ్బంది స్పందించరు. ఏ పంచాయితీలో నిర్వహణ సరిగా లేదు.

భారత దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ లేదు. రాష్ట్రాన్ని నిర్మాణం లేని పార్టీ పాలిస్తోంది. వారి సౌలభ్యం కోసమే వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకువచ్చింది. వాలంటీర్లు ఒక్క రోజు పని చేసి నెల రోజుల జీతాలు తీసుకుంటున్నారు. కేంద్రం నుంచి పంచాయితీలకు వచ్చిన నిధుల్ని విద్యుత్ బిల్లుల పేరిట దోచుకుంటున్నారు. ఓ వైపు రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటే కొన్ని గ్రామాల్లో పట్టపగలు కూడా లైట్లు వెలుగుతాయి. పంచాయితీల నిధులు సచివాలయాలకు ఖర్చు చేస్తున్నారు. ఘనమైన ఉద్దేశాలతో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించారు. రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తామన్నారు. వాటికి వైసీపీ రంగులు వేయడం మినహా చేసింది శూన్యం. పంచాయితీల్లో అన్ని రకాల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ కృషి చేయాలని కోరుకుంటున్నామ”న్నారు.

సర్పంచుల చెక్ పవర్ రద్దు దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు:  శ్రీ చెల్లప్ప

పంచాయితీ రాజ్ శాఖ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ చెల్లప్ప మాట్లాడుతూ.. “పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఐదు మంది వ్యక్తులు కలసి ఏక నిర్ణయం తీసుకోవడం. అక్కడ ముందుగా ఐక్యత అవసరం. నాయకత్వం స్థిరంగా ఉంటే నిధులు రావడం ఆలస్యం అయినా ఎప్పడో ఒకప్పుడు వస్తాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సర్పంచులందరికీ చెక్ పవర్ తీసేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్ప ఆ అధికారం ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగంలో ఉన్న చట్టం ప్రకారం అది సాధ్యపడదు. పంచాయతీరాజ్ టీచర్ల వ్యవహారంలో అప్పట్లో సుప్రీంకోర్టు వరకు వెళ్లినా పని జరగలేదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల వ్యవహారంలోనూ ప్రభుత్వమే కట్టేసి తెలియపర్చే విధానం వల్ల పంచాయితీలకు అన్యాయం జరుగుతోంది. మరో వాస్తవం ఏమిటంటే గ్రామ పంచాయటీలు అసలు విద్యుత్ బిల్లులే చెల్లించాల్సిన అవసరం లేదు” అన్నారు.

ప్రజలకు మంచి చేసేందుకు ఈ ప్రభుత్వం ముందుకు రాదు:  బొంతు రాజేశ్వరరావు

జనసేన నాయకుడు, ఆర్.డబ్ల్యూ.ఎస్. విశ్రాంత ఉన్నతాధికారి శ్రీ బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ.. “వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు న్యాయబద్ధంగా గ్రామాలకు రావాల్సిన నిధులు రాకుండా చేస్తూ ఇబ్బందులుపెడుతోంది. కేంద్రం నుంచి వచ్చే వేల కోట్లు గ్రాంట్లు రాబట్టుకునే విధంగా అంతా పోరాటం చేయాలి. గ్రామ పంచాయితీలు, కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇదంతా చరిత్ర కలిగిన వ్యవస్థ. రాజుల కాలం నుంచి బ్రిటీష్ పాలకుల వరకు స్థానిక సంస్థలకు పెద్ద పీట వేస్తే.. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిర్వీర్యం చేసేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 శాతం గ్రాంట్ ఇవ్వదు. ప్రజలకు మంచి చేసేందుకు ఈ ప్రభుత్వం ముందుకు రాదు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో కేవలం 15 శాతం మాత్రమే గ్రామాలకు ఇచ్చింది. మిగిలిన నిధులు ఏం చేశారో తెలియదు. సర్పంచుల తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు గళం విప్పి.. ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ప్రభుత్వం మెడలు వంచి నిధులు ఇప్పించాలి” అన్నారు.

73వ రాజ్యాంగ సవరణకు విరుద్ధంగా వాలంటీర్ల వ్యవస్థ: ప్రొఫెసర్ ఈ. వెంకటేష్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఈ.వెంకటేష్ మాట్లాడుతూ… గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థ. దీనిపై సుప్రీం, హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేస్తే జడ్జిమెంట్ గ్రామ పంచాయతీలకు అనుకూలంగా వస్తుంది. 2008 సంవత్సరం వరకు 14 వందల జడ్జిమెంట్లు స్టడీ చేసిన తరువాత ఈ మాటలు చెబుతున్నాను. 73వ రాజ్యాంగ సవరణకు విరుద్ధంగా వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ప్రభుత్వం నవరత్నాలు అనే కార్యక్రమం రూపకల్పన చేసింది. ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మాత్రమే గ్రామ, వార్డు సచివాలయం వ్యవస్థను తీసుకొస్తున్నామని జీవోలో పేర్కొంది. ఈ వ్యవస్థ వల్ల రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు బలహీనమవుతున్నాయి. దేశానికి ప్రధాన మంత్రి … రాష్ట్రానికి ముఖ్యమంత్రి… జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ … మండలానికి మండలాధ్యక్షుడు ఎంత ముఖ్యమో… గ్రామానికి సర్పంచు అంతే ముఖ్యం. నేడు గ్రామాల్లో పరిస్థితి చూస్తే సర్పంచుగా ఓడిపోయినోడు రోడ్డు మీద ఏడుస్తుంటే… గెలిచినోడు ఇంట్లో ఏడుస్తున్నాడు. పంచాయతీల్లో నిధులు లేకపోయినా గెలవడానికి లక్షల ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు” అన్నారు.

సచివాలయాలు, వాలంటీర్లు వచ్చాక సర్పంచులు డమ్మీలైపోయారు: – చిలకలపూడి పాపారావు

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ “30 నెలల క్రితం సర్పంచులుగా ఎన్నికైన మమ్మల్ని పట్టించుకున్న నాధుడు లేడు. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఎలా వుంటాయో తెలియకుండానే ఈ ప్రభుత్వం లాగేసుకుంది. కేంద్రం వద్దకు వెళ్లి బతిమలాడుకుని నిధులు విడుదల చేయించుకుంటే విద్యుత్ ఛార్జీల పేరిట 50 శాతం నిధులు ఈ ప్రభుత్వం తీసేసుకుంది. కమిషనర్ కి వినతిపత్రం ఇద్దామని వెళ్తే పోలీసులుతో కొట్టించి ఈడ్చేస్తున్నారు. సర్పంచులు చివరికి చాలా ప్రాంతాల్లో కూలీలుగా మారిపోతున్న దుస్థితి రాష్ట్రంలో ఉంది. సర్పంచుల సంఘం పెట్టుకుందామంటే బెదిరిస్తారు. సచివాలయం, వాలంటీర్లు వచ్చిన తర్వాత సర్పంచులు డమ్మీలు అయిపోయారు. సర్పంచులకు విలువ లేకుండా పోయింది. సచివాలయ వ్యవస్థను సర్పంచుల ఆధీనంలోకి తీసుకురావాలి. రాజ్యాంగం ప్రకారం మాకు సంక్రమించిన 29 అంశాలు మాకు బదిలీ చేయాలి. సర్పంచుల సమస్యల మీద స్పందించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు భరోసా ఇస్తే 13 వేల మంది మీ వెనుక నిలబడతామ”ని చెప్పారు.

రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి: జాస్తి వీరాంజనేయులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు

అఖిల భారత పంచాయితీ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీరాజ్ వ్యవస్థ అంటే చులకన భావం ఉంది. పంచాయితీలన్నీ నిధుల లేమితో కొట్టిమిట్టాడుతున్నాయి. ఆర్థిక సంఘం నిధులు ఒక్క రూపాయి పంచాయితీలకు ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చే నిధులను విద్యుత్ బకాయిల పేరిట దోచుకుంటున్నారు. నిధులు లేక అప్పులు |చేసి పంచాయతీలను నడుపుతున్నారు. ఒత్తిడి తీసుకోలేని పరిస్థితుల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధాని శ్రీ మోదీ గారితో మాట్లాడి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా పంచాయితీల ఖాతాల్లో జమ అయ్యే ఏర్పాటు చేయాలని కోరారు.

శనివారం జమ అయిన నిధులు సోమవారానికి మాయమయ్యాయి: కారుమంచి సంయుక్త, సర్పంచ్, మైసూరవారిపల్లి

రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి సర్పంచ్ శ్రీమతి కారుమంచి సంయుక్త మాట్లాడుతూ “నామినేషన్ నాటి నుంచే ఒత్తిడులు మొదలయ్యాయి. నామినేషన్ వేయకుండా ఉంటే రూ.20 లక్షలు ఇస్తామన్నారు. ఒక సైనికుడి భార్యగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు కట్టుబడి నిలబడి విజయం సాధించాను. ఇదే స్ఫూర్తితో కడప జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోవాలన్నది మా ఆకాంక్ష. మాకు 15వ ఆర్ధిక సంఘం నిధులు ఒక్క రూపాయి కూడా అందలేదు. శిక్షణ ఇచ్చినప్పుడు మనం కూడా చాలా చేయొచ్చనుకున్నాం. రూ. 11 లక్షల నిధులు శనివారం పంచాయితీ ఖాతాలో జమ అయితే సోమవారానికి జీరో అయిపోయింది. ఎందుకు అలా జరిగిందంటే కరెంటు బిల్లులు, ఖర్చులు అయిపోయాయంటున్నారు. తర్వాత రూ. లక్షా 39 వేలు వస్తే.. అవి అప్పుడే తీయకూడదు అంటున్నారు” అని వాపోయారు.

కక్షగట్టి చెక్ పవర్ తీసేశారు: శ్రీమతి బట్టు లీలా కనకదుర్గ, కోరుకొల్లు సర్పంచ్

కోరుకొల్లు సర్పంచ్ శ్రీమతి బట్ట లీలా కనకదుర్గ మాట్లాడుతూ “జనసేన పార్టీతో గెలిచిన సర్పంచ్ నని నా మీద కక్ష కట్టి చెక్ పవర్ తీసేశారు. వెంటనే సస్పెండ్ చేశారు. విషయం శ్రీ నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకువస్తే ధైర్యం చెప్పారు. కలెక్టర్ గారు చెక్ పవర్ వెంటనే ఇవ్వకపోతే.. కోర్టు ధిక్కరణ కేసు వేసి సాధించుకున్నాను. ఎస్సీ మహిళ సర్పంచ్ కావడం జీర్ణించుకోలేక నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. పంచాయితీలో అడుగుపెట్టకుండా తాళాలు వేసి అడ్డుకున్నారు. నా హక్కు నేను సాధించుకునేందుకు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పోరాటం చేశాను. విద్యుత్ బిల్లుల పేరిట నిధులు మళ్లించే ప్రయత్నం చేస్తే అడ్డం తిరిగాను. అధికారులు ఒత్తిడి ఉందని బతిమలాడుతున్నారు. వైసీపీలోకి వెళ్లిపోమని సలహా ఇచ్చారు. నాకు సహకరిస్తున్నారని తొమ్మిది మంది సెక్రటరీలను మార్చారు. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినా.. నా గ్రామాన్ని ఇబ్బంది పెట్టవద్దని కోరాను” అని అన్నారు.

ఆరు నెలలు ఓపిక పడితే ఈ ప్రభుత్వం పోతుందన్న ఆశతో ఉన్నాం: కారేపల్లి శాంతిప్రియ, సర్పంచ్ మత్స్యపురి

మత్స్యపురి సర్పంచ్ శ్రీమతి కారేపల్లి శాంతిప్రియ మాట్లాడుతూ.. “గడచిన 30 నెలల్లో మా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పంచాయితీలకు వెళ్లి బొమ్మల్లా కూర్చుంటున్నాం. వాలంటీర్లు, సెక్రటరీల ద్వారా వ్యవస్థల్ని నడిపిస్తున్నారు. పనులు చేద్దామంటే ఎస్టిమేషన్లు వేయరు. మా సొంత డబ్బు ఖర్చు చేస్తే తిరిగి రావు. రోడ్డు మరమ్మత్తు చేయమంటే రోడ్డు పక్కన ఉన్న మట్టి తీసి రోడ్డు మధ్యలో వేశారు. మరో ఆరు నెలలు ఓపిక పడితే ఈ ప్రభుత్వం పోతుందన్న ఆశతో కాలం వెళ్లదీస్తున్నాం” అన్నారు.

పంచాయతీలకు వైసీపీ రంగులు వేసి సచివాలయాలుగా మార్చారు: వేణుగోపాల్ రెడ్డి

కడప జిల్లా కమలాపురానికి చెందిన శ్రీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి వాటిని గ్రామ సచివాలయాలుగా మార్చారు. పంచాయితీల నిధులు దారి మళ్లించి నిర్వీర్యం చేసేశారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం ఏడాదికి రెండుసార్లు గ్రామ సభలు జరగాలి. రాష్ట్రంలో ప్రజలకు గ్రామ సభల గురించి తెలియదు. పంచాయితీలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పంచాయితీల నిధులకు రక్షణ ఉండాలంటే గ్రామ సభలు జరగాలి” అని అన్నారు. #savepanchayatsinap #gramapanchayats #gramasurpanch

జనసేన వస్తే పంచాయితీలకు ప్రాణ ప్రతిష్ట: పవన్ కళ్యాణ్